Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/748098

మోడీ మౌనవ్రతం వెనక...

దేశాన్ని కుదిపేస్తున్న అనేక సమస్యల పట్ల ప్రధానమంత్రి మోడీ మౌనవ్రతం పట్ల అనేక ప్రశ్నలు వస్తున్నాయి. తొలిసారి బీజేపీ జాతీయ స్థాయిలో అధికారానికి వచ్చినప్పుడు కేవలం పార్లమెంటరీ వ్యవస్థే దుర్వినియోగమైంది. రెండోసారి అధికారానికి వచ్చినప్పుడు ఈ దుర్వినియోగం రాజ్యాంగ యంత్రంలోని అన్ని వ్యవస్థలకూ, విభాగాలకూ పాకింది. ఈ మొత్తం ప్రక్రియలో విశ్లేషకులు దృష్టి సారించని ఓ కీలకమైన అంశం ఉంది.
                     ఏ దేశంలోనైనా ఉనికిలో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని కూలదోయాలంటే అది నిస్సహాయమైనదన్న అభిప్రాయం కలిగించటమే కాదు, జరుగుతున్న పరిణామాల పట్ల నిశ్చేష్టురాలై ఉండిపోయేలా చేయటం, నిస్సత్తువతో కూలబడిపోయేలా చేయటం కీలకమైన వ్యూహం. ఈ వ్యూహాన్ని అనుసరించడానికి ఆరెస్సెస్‌ సుశిక్షితమైన పద్ధతులు రూపొందించి అమలు చేస్తోంది. 1960 దశకంలో గోరక్షణ ఓ ధార్మిక అంశంగా మాత్రమే మొదలైంది. ఆరెస్సెస్‌ శ్రేణులు ఈ సమస్యను చేపట్టాక రాజకీయ అంశంగా మారింది. నేడు ఏకంగా పాలక పార్టీ చేతుల్లో అస్త్రంగా మారింది. పోలీసులను హత్య చేసే వరకు ఈ నినాదం సాధనంగా పని చేస్తోంది. 1970 దశకంలో కేవలం గోరక్షణ కోసమే ఆరెస్సెస్‌ శ్రేణులు చలో పార్లమెంట్‌ పిలుపునిచ్చాయి. అప్పటి వరకు పార్లమెంట్‌ భవనం బాహ్యవలయం వరకు సాధారణ ప్రజల రాకపోకలుండేవి. దాన్ని అవకాశంగా తీసుకుని గోరక్షణ ఉద్యమం పార్లమెంట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అనుభవం పొందిన రాజ్యాంగ యంత్రం పార్లమెంట్‌ చుట్టూ రక్షణ వలయాన్ని విస్తరించుకుంటూ పోయింది. చివరకు వివిధ ఉద్యమాలు, ఆందోళనలు, చలో పార్లమెంట్‌ పిలుపులకు వేదిక అయిన బోట్‌ క్లబ్‌ క్రమంగా కనుమరుగైంది. ఈ విధంగా రాజ్యాంగ యంత్రాన్ని బయటి నుంచి నీరుగార్చటంలో ఆరెస్సెస్‌ది ప్రత్యేక శైలి.

           జనతా ప్రభుత్వం పుణ్యమా అంటూ జాతీయ స్థాయి అధికారంలో పాలుపుంచుకునే అవకాశాన్ని దక్కించుకుంది నాటి జనసంఫ్‌. నేటి బీజేపీ నాటి నుంచే క్రమం తప్ప కుండా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో నిమగమైంది. ఈ వ్యవహారం మోడీ హయాంలో పతాక స్థాయికి చేరుకుంది. తమిళనాడు రైతులు రెండున్నర సంవత్సరాలకుపైగా జంతర్‌ మంతర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నోరు మెదపదు. బీజేపీ ఎంఎల్యేలు, ఎంపీలు వారి ఆశ్రితులు మహిళలపై పాశవిక దాడులకు పాల్పడుతున్నా బేటీ బచావో అన్న నినాదంతో హోర్డింగులకెక్కిన మోడీ చిరునవ్వు చెదరలేదు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజానీకం, వారికి జీవనోపాధి కల్పించే ఆర్థిక వ్యవస్థ కకావికలమవుతున్నా మోడీ విదేశీ పెట్టుబడుల కోసమంటూ సాగే యాత్రలు అక్కినేని నాగేశ్వరరావు సినిమా బహుదూరపు బాటసారిని గుర్తుకు తెస్తూనే ఉంటాయి.
కనీసం యూపీఏ ప్రభుత్వం హయాంలో కరువు ప్రాంతాల ప్రకటన, ప్రకృతి వైపరీత్యాల నిధి వెచ్చింపు వంటి పనులు జరుగుతూ ఉండేవి. మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిన మొదటి రెండున్నరేండ్లు ఐదు పంటలు (రెండు కార్లు రబీ, మూడు కార్లు ఖరీఫ్‌) ధ్వంసమైనా కరువు ప్రాంతాల ప్రకటన లేదు. పది మందిగా ఉన్న మొబైల్‌ కంపెనీల యాజమాన్యం 70 వేల కోట్ల రాయితీ కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. పదుల సంఖ్యలో ఉన్న ప్రయివేటు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల ప్రయోజనాలు కాపాడటానికి ఏకంగా రిజర్వు బ్యాంకు రీతి రివాజులనే మార్చేయవచ్చు. జాతీయ భద్రత భజన చేస్తూనే ఆ భధ్రతకు ముప్పు తెచ్చే రీతిలో యుద్ధ విమానాల కొనుగోలును దివాళా తీసిన ఆశ్రితులకు పెట్టుబడులు సమకూర్చే క్రతువుగా మార్చవచ్చు. ఈ ఆరోపణలు ఆధారాలతో సహా కనిపిస్తున్నా మోడీ 'స్థిత ప్రజ్ఞ' చెక్కు చెదరలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన శాసనసభ నియోజకవర్గాల్లో 75శాతం నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయినా మోడీ మౌనవ్రతం వీడలేదు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ సంఘం కోసం మూడు దఫాలుగా పార్లమెంట్‌ను స్థంభింప చేసిన బీజేపీ ఇప్పుడు రాఫెల్‌ కొనుగోళ్లపై అదే పని చేయటానికి, అవినీతిపై పోరాటంలో నిబద్దతను చాటుకోవటానికి సిద్ధం కావటం లేదు. పార్లమెంట్‌ రోజూ మిల్టన్‌ చెప్పిన పాండిమోనియంను తలపిస్తున్నా చట్టసభలను దారికి తెచ్చే చొరవ చూపటం లేదు. అటు పార్లమెంట్‌, ఇటు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నింటినీ ఆరెస్సెస్‌ ఎజెండాకు అనుగుణంగా నిరీర్యం చేయటంలో మోడీ మైఖేల్‌ మదన కామ రాజు పాత్రలు పోషిస్తున్నాడు.


             దేశం నిరంతర రావణకాష్టంగా మారుతున్నా మోడీ మౌనవ్రతాన్ని వీడకపోవటం గమనిస్తే మౌనం అర్థాంగీకారం అన్న సామెతను తిరగరాయాల్సిన అవసరం కనిపిస్తోంది. తన బలం, స్థాన బలంతో పాటు రాజకీయాల్లో సమయ బలం కూడా విలువైనదే. దేశంలో జరుగుతున్న పరిణామాలు మోడీ దూకుడుకు అడ్డు కట్ట వేస్తున్నాయి. అటువంటి సమయంలో ఆ అడ్డు కట్టలు తొలగించాలంటే ఎక్కువ శ్రమ చేయాలి. దానికి బదులు మౌనవ్రతం పాటించటం కన్నా మెరుగైన వ్యూహం మరోటి ఉండదు. ఈ పరిణామాలు, స్పందించాల్సిన అధినాధులు ఓరకంట గమనిస్తూ పెదవి విప్పక పోవటం గమనిస్తుంటే మత గ్రంధాల్లో కనిపించే ఓ పోలిక గుర్తుకొస్తోంది. సమస్త విశ్వం ప్రళయం విపత్తు అంచున ఉన్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు, అస్థిత్వం కోల్పోతున్నప్పుడు హిందూ మతంలో ఒక్కో అవతార మూర్తి ఉద్భవించి ఆ ప్రళయం, విపత్తు, నాశనం నుంచి విశ్వాన్ని ఆదుకొంటాడు. క్రైస్తవంలో అయితే నోవా ఆఫ్‌ ఆర్క్‌ ఘటన దీన్ని ప్రతిబింబిస్తుంది. బీజేపీ కూడా అటువంటి ఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

                    అయితే సాధారణ భక్తులకు ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతుంది. అంత శక్తి శాలి అయిన భగవంతుడు అని చెప్పబడే వ్యక్తి లేదా శక్తి ఇటువంటి విపత్తును నిలువరించి జరిగే నష్టాన్ని కూడా నిరోధించవచ్చు కదా అన్న ప్రశ్న. అయితే ఇక్కడే పెట్టుబడి పాత్ర వస్తుంది. మతానికి నమ్మకం పెట్టుబడి. ఈ నమ్మకం నాలుగు కాలాల పాటు వర్ధిల్లాలంటే అన్ని కాలాల్లోనూ ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉండాలి. నష్టం కనిపిస్తూ ఉండాలి. అలా నష్టపోయిన జీవులకు ఆఖరి ఆశగా సో కాల్డ్‌ భగవంతుడు ఉద్భవించాలి. ఇదీ మతం యొక్క (కు)తంత్రం. ఇదే వ్యూహతంత్రాన్ని మోడీ తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు. కనిపించని కల్కి అవతారంలో వచ్చే దేవుడు కండ్ల ముందు జరిగే ఘోరాలన్నింటికీ చరమగీతం పలుకుతాడు అన్న నమ్మకం మనకు తెలుసు. మోడీ కూడా కల్కి అవతారమెత్తాలని ఆరెస్సెస్‌ శ్రేణులు వ్యూహరచన చేస్తున్నాయి. అందులో భాగమే కోట్లాది మంది ప్రజలు కష్టాలు, కడగండ్లకు గురవుతున్నా ప్రధాని మౌనవ్రతం.

                 ఇది నయా కార్పొరేట్‌ పరిపాలన పద్ధతి. ఏదైనా ఓ పెద్ద కంపెనీలో దిగువ స్థాయిలో అనేక సమస్యలు రోజూ కనిపిస్తుంటాయి. అయితే కంపెనీ కీలక యజమాని రోజూ స్పందిచడు. కార్మికులు లేదా పరిపాలన విభాగంలోని ఉద్యోగులు తమ అర్జీలు సమర్పించుకునేందుకు, బాధలు వినిపించేందుకు సదరు యజమాని అందుబాటులో ఉండడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుదీ ఇదే శైలి. అలా ప్రజలకు అందనంత ఎత్తులోనో, దూరంలోనో ఉన్నప్పుడే అటువంటి వాళ్ల శక్తి సామర్ధ్యాల పట్ల అభూతకల్పనలు అల్లటానికి అవకాశం ఉంటుంది. అటువంటి అభూత కల్పనలను సజావుగా ఉంచగలగటం ఆధునిక రాజకీయ ప్రచార వ్యూహం. విజయమంత్రం. మోడీ పాటిస్తున్నదీ అదే. సాధారణంగా సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందటం పాతకాలపు సాంప్రదాయక రాజకీయ ప్రచార వ్యూహం. సమస్యలు కుప్ప పోసి వీటిని పరిష్కరించాలంటే ఆ ఒక్కడు మాత్రమే చేయగలడు అని నమ్మించటం, రాజకీయ ప్రయోజనం పొందటం, ఎన్నికల్లో గెలుపొందటం తదనుగుణంగా ప్రచార వ్యూహం రూపొందించుకోవటం ఆధునిక కార్పొరేట్‌ రాజకీయ వ్యూహం.

               అందులో భాగమే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం గావించటం. ఒకటి తర్వాత ఒకటిగా అన్నింటినీ నీరుగార్చి చివరకు కల్కి అవతారంలో వచ్చి ఈ కుదేలైన వ్యవస్థలను నిలబెట్టే బాహుబలిగా మోడీని చిత్రీకరించటంలో భాగం ఈ మౌనవ్రతం. లేని ఉత్పాతాన్ని చూపించటం, బూచిని చూపించి ఓటర్ల చేత చేదు గుళికలు మింగించాలంటే ఈ మాత్రం మౌనం అవసరం. ఈ స్థాయిలో గందరగోళం చెలరేగకపోతే పొడచూపే ఆశారేఖల కోసం జనం ఆబగా ఎదురుచూడరు. భారతదేశంలో నేడు ఆశ - నిరాశలు, సంక్షోభం - పరిష్కారాలు, గందరగోళం - క్రమశిక్షణలు, పాలనా వ్యవస్థల నిష్క్రియాపరత్వం - పాలకుల దన్నుతో సాగే మూక హత్యలు (బులంద్‌ షహర్‌ తరహాలో) జోడెద్దులుగా సాగుతున్నాయి. ఈ మౌనం చెలరేగుతున్న సంఫ్‌ు పరివార్‌ శ్రేణుల దుష్కృత్యాలకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు. మోడీ ఈ నాలుగున్నరేండ్లలో తొలిసారి ఇచ్చిన ఇంటర్వూ కేవలం ఏకపాత్రాభినయంగానే మిగిలిపోతుంది. ఇందులో దేశం ఎదురు చూస్తున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. రాజు గారి కొత్త బట్టల సామెతే. దేశం ఎదుర్కొంటున్న సమస్యలుగా ప్రజలు భావిస్తున్న వాటికి ఈ ఇంటర్వూలో మౌనమే సమాధానంగా ఉంది. మోడీ, పాలక ఆరెస్సెస్‌ బీజేపీలు సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు మాత్రమే ఇంటర్వూలో అడిగారు. ఇలాంటి వ్యూహాత్మక మౌనం వెనక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని దేశం ముందుంచటమే బాధ్యతాయుతమైన ప్రతిపక్షాల కర్తవ్యం.

కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

 http://www.navatelangana.com/article/net-vyaasam/753911

మీడియా గొంతు నొక్కుతున్న బీజేపీ

 http://www.navatelangana.com/article/net-vyaasam/759646

కుహనా శాస్త్ర విజ్ఞానం... వలసవాద వారసత్వం

కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుంచీ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారతీయుల కృషిపేరుతో కుహనా శాస్త్ర విజ్ఞానం విచ్చలవిడిగా ప్రచారమవుతోంది. పదేండ్ల క్రితం పత్రికల్లో భారతీయ శాస్త్రవేత్తల కృషి గురించి వచ్చిన వార్తలకు, నేడు వస్తున్న వార్తలకు మధ్య తేడా గమనిస్తే దేశంలో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనా కోణం ఎంతగా వెనకపట్టు పట్టిందో అర్థమవుతుంది. పదేండ్ల క్రితం యూరప్‌లో లార్జ్‌ హాడ్రన్‌ కొల్లైడర్‌ (విశ్వసృష్టి రహస్యాలు ఛేదించేందుకు జరుగుతున్న ప్రయోగం)లో భారతీయ శాస్త్రవేత్తల పాత్ర గురించి భారతీయ పత్రికలు విశ్లేషణలు ప్రచురించాయి. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి అమెరికా ఆంక్షలు అధిగమించి మరీ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) క్రయోజనిక్‌ ఇంజన్‌ తయారు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల మేధో సామర్ధ్యం చూసి ప్రపంచం అబ్బురపడింది. ఇప్పుడు దీనికి భిన్నంగా 'కుండ'పోతలే టెస్ట్‌ట్యూబ్‌ శిశువులంటున్న కుహనా శాస్త్రవేత్తలను చూస్తున్నాం. ప్రపంచం చూడని యుద్ధ విమానాలు రావణుడి వద్ద ఉన్నాయని కుహనా మేధావులు నిస్సిగ్గుగా ప్రకటించటం ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు తలదించుకునేలా చేస్తోంది.
దీనికి ఆజ్యం పోసింది స్వయంగా ప్రధాని మోడీయే అనటంలో సందేహం లేదు. 2015లో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో వినాయకుని జననం నాటి భారతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ అమల్లో ఉందని తెలియజేస్తోందని ఉపన్యసించారు. రాజును మించిన రాజభక్తులున్న దేశం మనది. కనుక ఆయన వెనకే వందలాదిమంది కుహనా శాస్త్రవేత్తలు బయల్దేరారు. వీరి ఉపన్యాసాలు వింటుంటే 1986లో మా పొరుగు గ్రామంలో జరిగిన సంఘటన గుర్తుకొస్తోంది. అప్పట్లో మేమంతా బళ్లో ఉన్నాం. ఊళ్లో గుప్పుమన్న వార్త ఇంటర్వెల్‌ సమయానికి బళ్లోకి వచ్చింది. పొరుగూర్లో ఓ గుడి ఉంది. గుడి ముందు రాగి చెట్టు వేప చెట్టు పెనవేసుకుని పెరిగాయి. పల్లెటూరి అనుభవం ఉన్న ప్రతివారికీ ఇది ఏమంత పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటన కాదు. అయితే ఈ చెట్ల ద్వయం పాలు కారుస్తోంది అన్నది ఆ పుకారు. అంతే.... మండలంలో సగం ఊళ్ల నుంచి జనం అక్కడ ప్రత్యక్షమయ్యారు. భారతీయ శాస్త్ర విజ్ఞాన మహాసభలో పోగైన వారిని, వారి వ్యాఖ్యలను చూస్తే మూడు దశాబ్దాల క్రితం మా పొరుగూర్లో గుంపులు గుంపులుగా వెళ్లిన పామర జనానికీ వీరికీ తేడా లేదని అర్థమవుతోంది.

ఈ కుహనా శాస్త్రవిజ్ఞానం నిర్దిష్ట రాజకీయ లక్ష్యంతో సాగుతున్న ప్రచారం. అభివృద్ధి కోసం ఆరాటపడే అన్ని దేశాల్లో చోటు చేసుకున్న పరిణామమే. భారతదేశంలో సైతం మేధో ప్రతిభ ఆ దశ దాటి ముందుకు వచ్చింది. కానీ పాలకవర్గం ప్రజలను మాత్రం ఆ దశలోనే ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నానికి ఆధునిక మూలాలు వలసవాదంతో పాటు భారతదేశంలో ప్రవేశించాయి క్రైస్తవ మిషినరీలు. వీటితో పాటే సాధారణ జనానికీ పరిచయమైంది తర్కం. దీంతో ఓ వైపు మిషినరీల ప్రభావాన్ని తట్టుకుని హిందూమతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేకమంది సంఘ సంస్కర్తలు ముందుకొచ్చారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస, రాజారామ్మోహన రారు, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. వీరి రచనల సారాంశం సనాతన చాంధస హిందూమతంలో సాధారణ తర్క విరుద్ధమైన విషయాలను తిరస్కరించటం ద్వారా ప్రజలకు తిరిగి హిందూమతంపై విశ్వాసం పెంపొందించడమే.. ఈ ప్రయత్నాలే తర్వాతి కాలంలో పెద్ద పెద్ద పీఠాలుగా, హిందూ ప్రచార వేదికలుగా చలామణి అవుతున్నాయి.
ఈ సమయంలోనే మరో ముఖ్యమైన ప్రయత్నం జరిగింది. వలసవాద పాలకులు భారతీయులను సమర్ధవంతంగా పరిపాలించాలంటే భారతీయ సంస్కృ‌తి, సాంప్రదాయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరమొచ్చింది. కానీ ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మనకు తెలీనిదంతా దైవమే అనుకోవటం తేలికైన పరిష్కారం. ఈ క్రమంలో పాశ్చాత్యులు ప్రాచ్య నాగరికతలను అర్థం చేసుకోవటానికి ఆయా దేశాల్లో పెద్ద పెద్ద సొసైటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. ఈ విధంగా 18వ శతాబ్దం చివరల్లో ఏర్పాటైన ఏషియాటిక్‌ సొసైటీ నడిపిన పత్రికలు, అందులోని వ్యాసాలు గమనిస్తే ఒక దేశాన్ని జయించటానికి వచ్చినప్పుడు సామ్రాజ్యవాదులు ఆ దేశపు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఎంతగా ప్రయత్నిస్తారో మనం తెలుసుకోవచ్చు. ప్రాచీన మధ్యయుగాల్లో లౌకిక విజ్ఞానం, అలౌకిక విజ్ఞానం రెండూ మతం ముసుగులోనే చలామణీ అయ్యేవి.

భారతదేశంలో వరాహమిహరుడు, ఆర్యభట్టూ ఉన్నట్టే పాశ్చాత్య సంస్కృ‌తిలో టోలమీ ఉన్నాడు. ఖగోళ శాస్త్రం పేరుతో టోలమీ అప్పటి వరకు అంతరిక్షం గురించి పాశ్చాత్య సమజాంలో ఉన్న అభిప్రాయాలను, అంచనాలను క్రోడీకరించి గ్రంధస్తం చేశాడు. అంతకు పూర్వం క్రీస్తు పూర్వం 700 సంవత్సరం నాటికి పాశ్చాత్య సమాజంలోనూ ఖగోళాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కో రాశికి ఒక్కో గుర్తు కేటాయించారు. ఆ గుర్తులన్నీ కుడిఎడంగా నేటికీ చలామణీ అవుతూనే ఉన్నాయి. ఆశ్చర్యమేమిటంటే రాశులకు కేటాయించిన గుర్తులన్నీ ప్రకృతిలో అత్యంత మౌలిక దశలో కనిపించే జంతువులు, వస్తువులే. ఈ విషయాన్ని మర్చిపోయి నాటికే ఆధునిక కాలెండర్‌ గురించి తెలుసునని మురిసిపోతే పాశ్చాత్య సమాజాలు శాస్త్రవిజ్ఞాన మార్గంలో ప్రగతి సాధించేవి కావు. అయితే పాశ్చాత్య సమాజాల పరిణామంలో కీలక పాత్ర పోషించింది తర్కం. ప్రశ్న. హేతువు. క్రీస్తు పూర్వం లౌకిక అలౌకిక విజ్ఞానాలు విడదీయరానంత పెనవేసుకున్నాయి. వాటిని విడదీసేందుకు పాటించిన ప్రమాణమే తర్కం. వాద, ప్రతివాదాలు. గ్రీకు నాగరికతలో వాదప్రతివాదాలకు సోక్రటీస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వేరు చేయలేం. ఆ విధంగా ప్రశ్నను ప్రోత్సహించిన పాశ్చాత్య సమాజాలు విజ్ఞాన శిఖరాలుగా పురోగమించాయి.

భారతదేశంలో సైతం ఈ విధంగా లౌకిక, అలౌకిక జ్ఞానాన్ని వేరు చేసేందుకు లార్డ్‌ కారన్‌ వాలీస్‌ వైస్రాయిగా ఉన్నప్పుడే ఓ ప్రయత్నం మొదలైంది. అప్పట్లో సంస్కృత భాష కేవలం బ్రాహ్మణుల గుత్తసొత్తు. సోకాల్డ్‌ హిందూమత గ్రంధాలన్నీ సంస్కృత భాషలోనే ఉండేవి. దీంతో ఏది లౌకిక జ్ఞానం ఏది అలౌకిక జ్ఞానం అన్నది నిర్ధారించుకునేందుకు వలస పాలకులకు ఈ మేధావులే శరణ్యమయ్యారు. ఈ విధంగా భారతీయ సమజాన్ని వలసపాలకులు అదుపాజ్ఞల్లో పెట్టుకోవటానికి తొలిసాయమందించింది మేధో పాలకవర్గమే. ముందే చెప్పుకున్నట్టు క్రైస్తవ మిషినరీల ప్రవేశంతో పలువురు సంఘ సంస్కర్తలు హిందూమతాన్ని సంస్కరించే పనిలో పడ్డారు. ఈ సంఘ సంస్కర్తలే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహులుగా గుర్తింపు పొందారు.
మరోవైపున వలసవాదులతో పాటు పరిపాలనలో భాగస్వాములైన బ్రాహ్మణవర్గం లౌకిక అలౌకిక జ్ఞానాలను వేరుచేసే పనిలో వలస పాలకులకు సహాయం చేయసాగింది. మధ్యయుగాల చివరిదశ వరకు భారతీయ వాంగ్మయం శృతిపరంపరపై ఆధారపడి ఉంది. అంటే ప్రాచీన ఇటలీ, గ్రీసుల్లో లాగా లిపి ఆధారిత సాహిత్యం కాదు. ఒక తరం మరో తరానికి, ఆ తరం తర్వాతి తరానికి చెప్పుకుంటూ (వాక్కు ద్వారా) రావటమే ప్రాచీన భారత వాంగ్మయం (దీన్నే వేదవాంగ్మయం అని కూడా పిలుస్తున్నారు) కొనసాగింపునకు మౌలిక ఆధారంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో వీటన్నింటిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో మాక్స్‌ ముల్లర్‌ వంటి పాశ్చాత్య మేధావులు చివరకు సంస్కృతం నేర్చుకుని తాళపత్ర గ్రంధాలు చదవటానికి సైతం సిద్ధమయ్యారు. ఈ విధంగా వలసపాలకుల అవసరాల కోసం లౌకిక అలౌకిక జ్ఞానాన్ని వేరు చేసే క్రమంలోనే ప్రాచీన భారత చరిత్రలో ఆధారాలు ఉన్నవీ లేనివీ భారతీయతగా చలామణీ చేసే అవకాశం వచ్చింది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని నిరూపించే ప్రయత్నం ఈ క్రమంలో ముందుకొచ్చిందే. ఈ విధంగా చరిత్ర రచన గుర్రానికి ముందు బండి కట్టి నడిపించే దిశలో సాగింది. రానురాను బ్రిటిష్‌ పాలకవర్గం సంపూర్ణ బూర్జువావర్గంగా ఎదిగింది. ఈస్టిండియా కంపెనీ స్థానంలో ఏకంగా బ్రిటన్‌ వలసాధిపతిగా ముందుకొచ్చింది. పాలితులను అజ్ఞానంలో ఉంచటమే పాలకుల వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ఏకైక మంత్రం. భారతీయులను సనాతన అజ్ఞానంలో మగ్గేలా చూడటమే ఆధునిక బ్రిటన్‌ పాలకవర్గానికి ప్రయోజనకారిగా కనిపించింది. దీంతో అలౌకిక జ్ఞానం కాస్తా లౌకిక జ్ఞానం ముద్ర వేసుకుని వీధుల్లోకి వచ్చింది. కుహనా శాస్త్ర విజ్ఞానమే అసలైన శాస్త్ర విజ్ఞానంగా చలామణీ అవటం ప్రారంభమైంది.

నాడు వలసవాద పాలకవర్గం తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి కుహనా శాస్త్రవిజ్ఞానమే నిజమైన భారతీయ శాస్త్ర విజ్ఞానమని భ్రమలు కల్పించింది. నేటి పాలకవర్గ పార్టీకి మాతృక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ నాడు కారన్‌వాలీస్‌ హయాంలో పాలకవర్గంలో అంతర్భాగమైన బ్రాహ్మణవర్గానికి నిజమైన ప్రతినిధి. తన లక్ష్యాలు నెరవేరాలంటే ఈ దేశంలో ప్రశ్న, హేతువు, తర్కం మిగిలి ఉండకూడదు. ఈ మూడు ఆరెస్సెస్‌ ప్రేరేపిత భారతీయతకు, హిందూత్వ పరిరక్షణకు ప్రథమ శతృవులు. అందుకే భారతీయ సమాజంలో ఈ మూడు - తర్కం, ప్రశ్న, హేతువు-లకు తావు లేకుండా చేసే పనిలో నిమగమై ఉన్నాయి. అందులో భాగమే నాటి వలసవాదం తరహాలో కుహనా శాస్త్ర విజ్ఞానమే అసలైన శాస్త్ర విజ్ఞానంగా ప్రచారం చేయటం. పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంలో ఉన్న న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వరాహమిహిరుడికి ఆపాదించటం, అణువిస్పోటనాన్ని భగవద్గీతలో కూర్చటం, కోపర్నికస్‌ కన్నా ముందే సూర్యుడిని నవగ్రహాధిపతిని చేసి ప్రధాన దేవాలయాల ముందు దిష్టిబొమ్మలుగా నిలబెట్టడం, వేదవ్యాసుడి మెదడులో టెస్ట్‌ట్యూబ్‌ బేబీల గురించిన ఆలోచనను కుక్కటం, నిన్న మొన్నటి వరకు హిందువులను సమీకరించటానికి విలన్‌ అవతారంలో చూపబడిన రావణుడు ఏకంగా వైమానిక పరిజ్ఞానం కలిగిన మేధావిగా మారటం యావత్తూ వలసవాద వారసత్వంతో మొదలైన కుహనా శాస్త్ర విజ్ఞానానికి ఆధునిక పునాది కల్పించటమే. ఇదే సమయంలో భారతీయ పాలకవర్గం తన వర్గ ప్రయోజనాలు కాపాడుకోవటానికి రాఫెల్‌ యుద్ద విమానాలు కావాలంటూనే ప్రజలను మాత్రం ఊహాజనితమైన రావణ విమానాల గొప్పలు చెప్పుకుని మురిసిపొమ్మంటోంది. వలసవాదానికి అత్యంత నమ్మదగిన మిత్రులు సావర్కార్‌, గోల్వాల్కర్‌. వీరిద్దరి శిష్యపరంపరలో ఎదిగి వచ్చిన ఆరెస్సెస్‌ పర్యవేక్షణలో పరిపాలన సాగించే బీజేపీ నుంచి ఇంతకన్నా గొప్పగా ఏమీ ఆశించలేం. భారతదేశాన్ని ప్రపంచం గుర్తించదగిన శక్తిగా మార్చాలంటే ఆధునిక శాస్త్రవిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తేవటం, శాస్త్రీయ ఆలోచన సార్వత్రికం చేయటం తక్షణ అవసరం. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఈ రెండు లక్ష్యాల సాధనకు అవరోధం. నిజమైన దేశభక్తుల ముందున్న కర్తవ్యం సుస్పష్టమే.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

http://www.navatelangana.com/article/net-vyaasam/760618

మోడీ మోసాలకు పరాకాష్ట 2019 తాత్కాలిక బడ్జెట్‌

http://www.navatelangana.com/article/net-vyaasam/768904

పుల్వామా దాడి నిఘా వైఫల్యమా? విధాన వైఫల్యమా?

నలభైమంది బలైపోయిన సంఘటన పట్ల దేశమంతా అవాక్కయ్యింది. సోషల్‌ మీడియాలో దేశభక్తి పెల్లుబికింది. ప్రణాళిక ప్రకారం కొవ్వొత్తుల ప్రదర్శనలు, నినాదాలు, ప్రతిజ్ఞలు జరిగిపోయాయి. ఇంకా మరికొందరు 'దేశభక్తులు' మరో అడుగు ముందుకేసి దేశ పౌరులంతా తమ దినసరి ఆదాయంలో ఒక్కో రూపాయి అమర జవాన్‌ల నిధికి కేటాయించాలని, దేశభక్తి ఉన్న వారైతే సదరు మెస్సేజ్‌ చదివాక తమ పోన్‌లలో ఉన్న సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇంకొందరి దుందుడుకుతనం హద్దుమీరింది. డెహ్రాడూన్‌లో ఓ కాలేజీ చదువుతూ హాస్టల్లో నివశిస్తున్న జమ్ము కాశ్మీర్‌ విద్యార్థులపై దాడికి పూనుకున్నారు. వాట్సప్‌ సందేశాల్లో ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుకు బదులు అమరుల దినోత్సవంగా జరపాలన్న ప్రతిపాదన కూడా వైరలైంది.
మరోవైపు మీడియాలో అనేక సూచనలు, సలహాలతో కూడిన విశ్లేషణలు వచ్చాయి. కొందరు చేయి తిరిగిన రచయితలు దేశ యువత సహనం కోల్పోయిందని, తక్షణమే ప్రభుత్వం పాకిస్థాన్‌ పీచమణచాలని సూచించారు. మరికొందరు రచయితలు జైషే మొహ్మద్‌ ఉగ్రవాద సంస్థ తరహాలో భారతదేశం కూడా పాకిస్థాన్‌లో కోవర్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సిన దళాలను తయారు చేసుకోవాలని కోరారు. సాంస్కృతిక సంబంధాలు తెంచుకోవాలని కొందరు, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని కొందరు వాఘా బోర్డర్‌ వద్ద బాలీవుడ్‌ బాజార్‌ ఎత్తేయాలని మరికొందరు... చెప్పుకుంటూ పోతే మహాభారతమే అవుతుంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఈ అమరుల జాబితా తయారు చేసి ఆయా రాష్ట్రాల్లో ఘన నివాళి అర్పించే వ్యూహరచన చేసింది. ఈ నివాళి ప్రణాళిక గమనిస్తే గోధ్రా రైలు మృతుల నివాళిపేరుతో విశ్వహిందూ పరిషత్‌ సాగించిన మారణకాండ గుర్తుకొస్తోంది. ఈ ప్రణాళిక ఇప్పటికే పని చేయటం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ప్రవేశించే వారికి ఎల్బీనగర్‌ మొదలు సికిందరాబాద్‌ స్టేషన్‌ వరకు అన్ని హౌటళ్లలో ఖుదాగవా, బోర్డర్‌, సర్‌ఫరోష్‌ వంటి సీమాంతర ఉగ్రవాదం కథనంగా ఉన్న సినిమా పాటలు పెట్టారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు నేషనల్‌ కాడెట్‌ కోర్సు వేషధారణలో సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించటం చూడొచ్చు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అస్సాంలో భారతీయ యువమోర్చా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాబట్టి చేతులు ముడుచుకు కూర్చున్నదని మోడీ నాయతక్వంలో బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు తగిన రీతిలో సమాధానం చెపుతుందని హుంకరించారు. ఏదో ఒక సంఘటనను ఉపయోగించుకుని దేశభక్తి పేరుతో ఆరెస్సెస్‌ తన ఎజండా ఎలా జొప్పిస్తుందో గుర్తించేందుకు ఈ పరిణామాలు ఓ ఉదాహరణగా నిలుస్తాయి. దేశభక్తి పేరుతో జరిగే ప్రతి చర్య, నినాదం వెనక దేశభక్తిని మించిన రాజకీయ ఎజెండా దాగి ఉందన్న వాస్తవాన్ని విడమర్చి చెప్పటానికే ఇన్ని ఉదాహరణలు.

పుల్వామాకు ఆనుకుని ఉన్న పింగ్లాన్‌ గ్రామంలో తలదాచుకున్న జైషే మొహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజర్‌ కుడిభుజం అని చెప్పబడుతున్న కమ్రాన్‌ను దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే భారత సైన్యం మట్టుబెట్టిందన్న వార్తలొచ్చాయి. ఈ రెండు రకాల వార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తే పుల్వామా దుర్ఘటనకు నిఘా వ్యవస్థల వైఫల్యం కారణమంటూ వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం. ఇటువంటి దాడికి సీమాంతర ఉగ్రవాద సంస్థలు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం నిఘా సంస్థల ద్వారా కేంద్రానికి, ప్రధాని కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారు వద్ద ముందే పోగుపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఏటా ఆగస్టు 15కో, జనవరి 26కో ఉగ్రవాదదాడి పొంచి ఉందంటూ మహానగరాల నుంచి మారుమూల పట్టణాల వరకు కాశ్మీర్‌లోని గుల్‌మోహర్‌ మొదలు ఏపీలోని గుంటూరు వరకు పొలీసులు, రిజర్వు బలగాల పహారా పెడుతూ ఉంటారు. ప్రజాతంత్ర యుతంగా ఎన్నికైన జమ్ము కాశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుకు కూడా కేంద్రం ఈ ఉగ్రవాదుల భయాన్నే వాడుకుంది. ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ మాలిక్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నందున మొహబూబా ముఫ్తి నేతృత్వంలోని ప్రభుత్వ రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించారు. రాష్ట్రపతి పాలన అంటే ఏకంగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనే. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ నేతృత్వంలో అప్పటి వరకు దాదాపు దశాబ్దంన్నరకు పైగా కొనసాగిన రాష్ట్రపతిపాలన రద్దు చేసి ఎన్నికలు జరిపే సాహసానికి పూనుకున్నది. కానీ 56అంగుళాల ఛాతీ కలిగిన మోడీ నాయకత్వంలో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రాష్ట్రపతి పాలన పడగనీడకు చేరింది జమ్ముకాశ్మీర్‌. మరి ఈ రెండు దశాబ్దాల పాటు అందుబాటులో ఉన్న శాంతియుత పరిస్థితుల్ని ఉపయోగించుకుని జమ్ము కాశ్మీర్‌ యువతను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తేవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేమిటి? అటువంటి ప్రయత్నాలు జయప్రదమై ఉంటే సీమాంతర ఉగ్రవాదమే కాదు, గ్రహాంతర ఉగ్రవాదం కూడా దేశాన్నేమీ చేయలేదు. పాలకవర్గాల ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటానికి దేశభక్తి పేరుతో ప్రజల కండ్లు గప్పేందుకు ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాద కరం. కాశ్మీరీ యువతను నిరుద్యోగులుగా గుర్తించి ఉపాధి అవకాశాలు పెంచే విధానాలు రూపకల్పన చేయటానికి బదులు బీజేపీ ప్రభుత్వం ఈ కాశ్మీరీ యువతను ముస్లింలుగానూ, పాకిస్థాన్‌ మద్దతు దారులుగానూ చూపించటం ద్వారా చేతులు దులిపేసుకునేందుకు సిద్ధమవుతోంది. కాశ్మీర్‌కు దేశానికి మధ్య మరింత దూరం పెంచుతోంది.

ప్రధాని కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారు మాటే శాసనం. దేశంలోనే అత్యంత చాకచక్యం కలిగిన నిఘా అధికారి అజిత్‌ దోవల్‌ అటువంటి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఒకవైపున దేశ చరిత్రలోనే అత్యంత దైర్యవంతుడైన, భారీ ఛాతీ కలిగిన మోడీ, మరో వైపున భారతీయ జేమ్స్‌ బాండ్‌ అని ముద్రను స్వంతం చేసుకున్న దోవల్‌ ద్వయం ఆధిపత్యం చలాయిస్తున్నా పుల్వామా ఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? గత కొద్ది కాలంగా ప్రత్యేకించి డిసెంబరు, జనవరిల్లో జరిగిన అనేక పరిణామాలు పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
నవంబరులో మొదలైన సీబీఐ సంక్షోభం జనవరి నాటికి ఓ రూపానికొచ్చింది. బాద్యతల్లో ఉన్న సీబీఐ అధికారి అలోక్‌వర్మను ఇంటికి సాగనంటానికి కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్‌, అనాలసిస్‌ వింగ్‌(రా) సిబ్బందిని ఉపయోగించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని కప్పి పుచ్చటానికి నిఘావిభాగపు కీలక అధికారులను పనిలో పెట్టింది. మోడీకి డిసెంబర్‌, జనవరి అత్యంత కీలకమైన సమయం. బ్యాంకు రుణాల ఎగవేతదారులను, వేలకోట్లల్లో అక్రమ విదేశీ వ్యాపారాలు చేసే వారిని నియంత్రించాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రతిపక్ష నాయకులను వెంటాడటంలో బిజీగా ఉండటంతో దాదాపు రూ.3లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన భారీ కంపెనీల అధిపతులు కులాసాగా తిరుగుతున్నారు.

డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘఢ్‌లలో బీజేపీ ఓడిపోయింది. అప్రమత్తమైన మోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లోని నిఘా విభాగం ఉన్నతాధికారులందరినీ ఢిల్లీలో సమావేశపర్చి బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించాలని పురమాయించారు. వచ్చేఎన్నికల్లో బీజేపీ విజయావకాశాల గురించీ అంచనా కట్టాలన్నది వారికి ఇచ్చిన ఆదేశాలు. ఇక జాతీయ భద్రతను తన భుజస్కంధాలపై మోస్తున్న అజిత్‌ దోవల్‌ సరిగ్గా ఆ బాధ్యతలు విస్మరించి రాఫెల్‌ ఒప్పందాన్ని గట్టెక్కెంచేందుకు రిలయన్స్‌ కంపెనీకి ఆర్థిక భద్రత కల్పించేందుకు తన శక్తి సామర్ధ్యాలు ధారపోయటంలోనే గడిపేస్తున్నారు.
ప్రభుత్వ విధాన లోపాల ఫలితమే పుల్వామా దుర్ఘటన అన్న విషయాన్ని కప్పిపుచ్చటానికి దేశభక్తిని ముందుకు తెస్తున్నారు. ఈ సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొన్న లక్షలాదిమందిది మాత్రమే నిజమైన దేశభక్తి అనీ, ప్రభుత్వం, నాయకుల వైఫల్యాలు ఎత్తి చూపేవారిది దేశద్రోహం అని ముద్రవేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి రానున్న కాలంలో పొంచి ఉన్న ప్రమాద ఘంటికల గురించి హెచ్చరికలే.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

 http://www.navatelangana.com/article/net-vyaasam/773094

ఉద్రేకాలు పెంచటంతో ఉగ్రవాదం అంతమౌతుందా?

బాలాకోట్‌ అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని భారత వాయుసేన ధ్వంసం చేసింది. దాడిలో భాగంగా గ్వాలియర్‌, ఆగ్రా, భటిండా మూడు వైమానిక శిబిరాల నుంచి 12 యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. అంబాలా వైమానిక బేస్‌ వరకు మూకుమ్మడిగా ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు అక్కడ నుంచి వేర్వేరు దారుల్లో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చీలిపోయాయి. మధ్యలో గగనతలంలోనే యుద్ధ విమానాలకు అవసరమైన చమురు సరఫరాకు కూడా ఏర్పాట్లు జరిగాయి. యుద్ధ వ్యూహం రీత్యా ఇది చూడటానికి, చదవటానికి ఆసక్తిగానే ఉంటుంది. ఉదయం 11.30 ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విదేశాంగ శాఖ కార్యదర్శి నిఘా వర్గాల సమాచారం మేరకు భారతదేశంపై మరింత ఉధృతమైన దాడులకు జెయిషే మొహ్మద్‌ తీవ్రవాద సంస్థ సిద్ధపడుతున్నందున, ముందస్తు జాగ్రత్తగా సైనికేతర దాడికి పాల్పడ్డామని, ఈ దాడిలో సాధారణ ప్రజలకు ఎటువంటి హాని జరక్కుండా జాగ్రత్త పడ్డామని ప్రకటించారు.
ఏది ఏమైనా ప్రభుత్వ ప్రకటనల ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్థాన్‌ సరిహద్దులోకి చొచ్చుకుపోయి బాంబులు వేసింది. ఈ బాంబు దాడిలో ఉగ్రవాద శిక్షణా శిబిరంలో తలదాచుకున్న మూడువందల మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. జైషే మొహ్మద్‌ వ్యవస్థాకుడు మసూద్‌ అజర్‌ మేనల్లుడు, శిక్షణ దళపతి కూడా చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత రక్షణ దళాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అయితే అప్పటికే పాకిస్థాన్‌ త్రివిధ దళాల అధికార ప్రతినిధి గఫార్‌ తన ట్వీటర్‌ పోస్టులో భారత వైమానిక దాడి గురించి ప్రస్తావించటంతో ప్రపంచం మేల్కొంది. వ్యూహాత్మకంగా రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా చేతిలో దేశ భద్రతకు ఢోకా లేదు అంటూ ఉపన్యసించిన మోడీ 2019 ఎన్నికల్లో బాలాకోట్‌ దాడులను వ్యూహాత్మక ప్రచార సాధనంగా మార్చుకోబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఈ దాడి ద్వారా భారతదేశం సాధించదల్చుకున్న లక్ష్యాలు ఏమిటి? భారతదేశంలో ఎంచుకున్న ప్రాంతంలో ఎంచుకున్న రీతిలో పాక్‌ మద్దతుతో ఉగ్రవాదులు దాడి చేయగల సామర్ధ్యం కలిగి ఉండటం సైన్యంతో సహా భారతీయులెవ్వరికీ మింగుడు పడనిది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా పాకిస్థాన్‌లోకి చొరబడి క్షేమంగా వెనక్కు తిరిగిరాగవలని నిరూపించటం ఈ వ్యూహత్మక సైనిక లక్ష్యంలో మొదటి అంశం. బాలాకోట్‌ ప్రాంతంలో బాంబుదాడి జరిగిన చోట పెద్ద గుంట కనిపించిందని స్థానికులు చెప్పినట్టు రాయటర్స్‌ వార్తా సంస్థ ప్రకటించింది. 300మందికి పైగా మరణించిన చోట కనిపించాల్సిన కకావికలమన పరిస్థితులు అక్కడ కనిపించలేదన్నది ఈ వార్త సారాంశం. భారతీయ నిఘా వర్గాల అంచనా ప్రకారం అక్కడ శిక్షణా కేంద్రం ఉండి ఉండవచ్చు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులందరూ బాలాకోట్‌లోనే తలదాచుకుని ఉన్నారా అన్న సందేహం ఇప్పుడు అంతర్జాతీయ సందేహంగా మారింది.
వాయుసేన చేపట్టిన ఈ దాడి విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ ఈ విజయాలను ఖరారు చేసే విధంగా ఏరకమైన ఫొటోలు, కనీసం బాంబుదాడికి గురైన ప్రదేశానికి సంబంధించిన భౌగోళిక చిత్రపటాలు, మ్యాప్‌లు కూడా విడుదల చేయలేదు. ఖాళీ స్థలంలో బాంబులు పడటంతో అక్కడ పెద్దగుంట పడిందంటూ పాకిస్థాన్‌ సైనిక అధికార ప్రతినిధి ట్విటర్‌లో విడుదల చేసిన ఫోటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ దాడిలో ఫాల్కన్‌ యుద్ధ విమానాలు కూడా ఉపయోగించారనీ, మిరేజ్‌ యుద్ధ విమానాల్లో లేజర్‌ కిరాణాల ద్వారా లక్ష్యాలను గుర్తించారని వార్తలు వచ్చాయి. అటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన యుద్ధ విమానాలు దాడి తర్వాత ఉన్న పరిస్థితికి సంబంధించిన ఏ వివరాలు మోసుకు రాలేకపోయాయంటే ఆశ్చర్యం వేస్తోంది. 1990లో ఇరాక్‌పై జరిగిన దాడిలో స్కడ్‌ క్షిపణులు మోసుకెళ్లిన ఈ ఫాల్కన్‌ విమానాలే దాడి అనంతరం దాడిలో జరిగిన నష్టాన్ని ధృవీకరించే చిత్రాలను కూడా సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌ టీవీ ద్వారా ప్రపంచానికి అందచేశాయి. బహుశా ఈ ఆధారాలన్నీ ప్రపంచం ముందుంచితే ప్రతిదాడి చేయాలంటూ పాకిస్థాన్‌ ప్రజలు ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని, ఉపఖండంలో యుద్ధ వాతావరణం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో జరిగిన నష్టానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దాచి ఉంచితే మంచిదే. కానీ మోడీ ప్రభుత్వపు ఈ చర్య సఫలత ఈ రోజుకు ఈరోజే రుజువయ్యేది కాదు. రానున్న కాలంలో జైషే మొహ్మద్‌ ఉగ్రవాద ఘాతుకాలు ఏ మేరకు తగ్గుతాయో ఆమేరకు ఈ చర్యలు ఫలితాన్ని ఇచ్చినట్టు భావించాలి. కార్గిల్‌ విజయం పార్లమెంట్‌పై దాడి జరక్కుండా నిలువరించ లేకపోయిన సంగతిని, యూరి సర్జికల్‌ దాడులు పుల్వామా జరక్కుండా ఆపలేకపో యాయి అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.

దాడికి ప్రభుత్వం నిర్దేశించుకున్న మరో లక్ష్యమే - మోడీ సామర్ధ్యాలను నిరూపించే లక్ష్యం - మరింత ఆందోళనకరమైనది. నిజమైన దేశభక్తులు, శాంతికాముకులు తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇందులో భాగమే 1971యుద్ధం తర్వాత తొలిసారి వాయుసేనను ప్రయోగించే సాహసం మోడీ మాత్రమే చేయగలిగాడన్న వాదన. ఇటువంటి చర్యలు ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని నిలువరించటం, అడ్డుకట్టవేయటం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించినందునే గత ప్రభుత్వాలు ఇందుకు పూనుకోలేదన్న వాస్తవం ఈ ప్రచార హౌరులో మరుగున పడిపోతోంది. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం, 2008లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కూడా ఈ విధమైన లేప్రొస్కోపిక్‌ దాడుల గురించిన ప్రతిపాదనలను చర్చించినప్పటికీ ఈ దాడుల వల్ల ఒనగూడే రాజకీయ ప్రయోజనం కంటే ఆర్థికనష్టమే ఎక్కువని గుర్తించి తోసిపుచ్చాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించటానికి వైమానిక దాడులే మార్గం అయితే అఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ను నేలమట్టం చేయటానికి బదులు భారతదేశం కంటే శక్తివంతమైన వైమానిక సాయుధ సంపత్తి కలిగిన అమెరికా ఆయా దేశాల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే సరిపోయేది. ఇజ్రాయెల్‌ ఎంత బలప్రయోగానికి పూనుకున్నా పాలస్తీనా ప్రజల తిరుగుబాటు చర్యలు, సైనికులు ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉండటం చూస్తూనే ఉన్నాం. దేశభక్తి హౌరులో, మోడీ భజన మోతలో వాస్తవాలు గుర్తించలేని స్థితికి చేరుతున్నామా అన్నది ఇక్కడ పరిశీలించాలి.

పుల్వామా దాడితో దెబ్బతిన్న భారతీయుల మనోభావాలను గౌరవించేందుకు మోడీ సర్కార్‌ ఈ దాడికి పూనుకున్నది అన్న వాదన చాలా ప్రమాదకరమైంది. భారతదేశ ప్రజల మనోభావాల పేరుతో మన ప్రభుత్వం ఒకవైపూ, పాకిస్థాన్‌ ప్రజల మనోభావాల పేరుతో ఆ పాలకులు మరోవైపు స్పందిస్తే జరిగేదేమిటీ? ఉపఖండం యుద్ధ మేఘావృతమవుతుంది. రెండు దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలు పక్కదారి పడతాయి. ఈ వ్యాఖ్య రాసే సమయానికి రెండు దేశాల వైమానిక, పదాతి దళాలు పరస్పరం ఆధిపత్య నిరూపణ కోసం బరిలో దిగాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రజలలో భావోద్వేగాలు సహజం. పాలకులు వాటిని ఎగదోయకూడదు. రాజకీయ పార్టీలు వాడుకునే ప్రయత్నం చేయకూడదు.
-కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

http://www.navatelangana.com/article/net-vyaasam/776811

మోడీ చేతుల్లో దేశం సురక్షితమేనా?

గత నెల రోజులుగా జాతీయ ప్రాంతీయ పత్రికల్లో మూడో పేజీలో పూర్తి పేజీ ప్రచార ప్రకటనలు వస్తున్నాయి. అంతకు ముందు టీవీల్లో కూడా అటువంటి ప్రకటనలు వచ్చాయి. ఇప్పటి వరకు జరగని అభివృద్ధి మోడీ పాలనలో మాత్రమే సాధ్యమైంది అన్నదే ఈ ప్రకటనల సారాంశం. బుధవారం సుప్రీం కోర్టులో ప్రభుత్వ అటార్నీ జనరల్‌ ప్రకటన కూడా ఈ కోవకే వస్తోంది. రక్షణశాఖ కార్యాలయం నుంచి రాఫెల్‌ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీ అయ్యాయని నిస్సిగ్గుగా ప్రకటించారు. ఫిబ్రవరి 28న బాలాకోట్‌ దాడి తర్వాత ప్రధాని మోడీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పుడు దేశ భద్రతకు ఢోకా లేదు అని విజయగర్వంతో మాట్లాడారు. మరునాడు జరిగిన ఓ అవార్డు ప్రదాన సభలో మాట్లాడుతూ.. అబ్బా.. ఈ సమయంలో గనక మన చేతుల్లో రాఫెల్‌ ఉంటే ఇంకెంత బాగుండేదో అన్నారు. అంతటితో ఆగలేదు. గతవారం రోజులుగా రాఫెల్‌ కొనుగోలును దేశద్రోహులైన ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని అందుకే ఇంతవరకు రాఫెల్‌ విమానాలు దిగుమతి చేసుకోలేకపోయామనీ శెలవిచ్చారు.
కాస్త అటు ఇటుగా సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ కూడా ఇదే భాష ప్రయోగించారు. ఆయన బాలాకోట్‌ అనంతరం సరిహద్దుల్లో జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ''తాజాగా ఎఫ్‌ 16 యుద్ధ విమానాలతో మన దేశంపై దాడి జరిగింది. అటువంటి దాడుల నుంచి మనలను మనం కాపాడుకోవటానికి రాఫెల్‌ విమానాలు అవసరం'' అన్నారు. అంతేకాదు. ఈ విచారణ కొనసాగితే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రతి వ్యాఖ్యను ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయని, ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందని వాపోయారు. రాఫెల్‌ కొనుగోలు పత్రాలు దొంగిలించటం ఏమిటి, ఎఫ్‌ 16 దాడులను ఎదుర్కోవాలంటే రాఫెల్‌ ప్రయోగించాలన్న వాదనలు సుప్రీం కోర్టుకు చేరటం ఏమిటి అన్న ప్రశ్నలు దేశభక్తులను కలచి వేస్తున్నాయి.

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హాలు రాఫెల్‌ కొనుగోలు వివాదంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏతావాతా ఓ అడ్డగోలు వాదనను అడ్డం పెట్టుకుని సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దానికంటే ముందు ప్రభుత్వం కొన్ని విషయాలు సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు తెలియచేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన వివరాలు అసత్యాలనీ, వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పు చెల్లదని, రాఫెల్‌ కొనుగోలు వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని మరో పిటిషన్‌ జనవరిలో దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణ దశకు రానివ్వకుండా ఉంచటానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.
ఎట్టకేలకు మొన్న బుధవారంనాడు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించింది. విచారణలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించటానికి వచ్చిన అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ రక్షణశాఖ కార్యాలయం నుంచి కీలక పత్రాలు దొంగిలించబడ్డాయని, వాటి ఆధారంగానే ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలైందనీ, దొంగిలించబడిన సాక్ష్యాలపై ఆధారపడకూడదని వాదించారు. ఈ వాదన విన్న దేశం నివ్వెరపోయింది. రక్షణశాఖకే మోడీ పాలనలో భద్రత లేదన్న కఠోర సత్యాన్ని మొట్టమొదటిసారి దేశం దృష్టికి తీసుకువచ్చినందుకు అటార్నీ జనరల్‌ అభినందనీయుడే. తన వాదనలో రివ్యూపిటిషన్‌లో ప్రస్తావించిన కారణాలు అసంబద్ధ మైనవని గానీ, నిర్హేతుకమైనవనిగానీ, అసత్యాలని గానీ ఎక్కడా చెప్పలేదు అటార్నీ జనరల్‌. అవి లీక్‌ అయిన పత్రాల ఆధారంగా దేశం ముందుకు వచ్చిన వివరాలు కాబట్టి వాటికి విలువ లేదని మాత్రమే 'నైతిక' వాదన ముందుకు తెచ్చారు. దీంతో ఈ క్రింది విషయాలు స్పష్టమవుతున్నాయి.

రాఫెల్‌ కొనుగోలు సందర్భంగా జరిగిన సంప్రదింపుల్లో ప్రధాని కార్యాలయం ప్రత్యేకించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని, అందువల్ల భారత ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, అవసరానికి మించి ధర చెల్లించాల్సి వచ్చిందని సంప్రదింపుల బృందం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దోవల్‌ జోక్యంతోనే దస్సాల్ట్‌ కంపెనీ ఎటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే ఈ కాంట్రాక్టును స్వంతం చేసుకుందన్నదీ వాస్తవం. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఈ ఒప్పందంలో అవినీతి నియంత్రణకు సంబంధించిన క్లాజు తొలగింపునకు ప్రధాని ఆదేశాలిచ్చారన్నది వాస్తవం. అప్పటికే ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దస్సాల్ట్‌ కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు తయారు చేసి గడువులోపల మనకు అందించగలుగుతుందా అని భారత వాయుసేన అధికారులు అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. 2015లో మోడీ ఈ కాంట్రాక్టును దస్సాల్ట్‌కు ఖాయం చేయటానికి కొన్ని రోజుల ముందే అనిల్‌ అంబానీకి దస్సాల్ట్‌ కంపెనీకి మధ్య రహస్య సమావేశం జరిగిన మాట వాస్తవం. రెండు ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందంలో సార్వభౌమత్వంతో కూడా హామీ ఉంటుంది. ఈ హామీ ఇవ్వటానికి ఫ్రాన్స్‌ సిద్ధం కాకపోయినా ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం దాచిపెట్టిందన్న మాట కూడా వాస్తవం. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రశ్నించలేకపోవటం మోడీ ప్రచారంలో ఉన్న డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోంది.

అంతేకాదు. వరుసగా హిందు, కార్వాన్‌, వైర్‌ పత్రికల్లో వస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అయినా డిశంబరులో జరిగిన విచారణలో ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా ఈ వివరాలు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు రాకుండా అత్యుతన్నత న్యాయస్థానం కండ్లు గప్పింది అన్న విషయం కూడా బుధవారంనాటి విచారణతో స్పష్టమైంది. ఓ సారి కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసిన తర్వాత దానిలో ఇష్టం వచ్చిన క్లాజులు తీసేయటం, ఇష్టం వచ్చిన క్లాజులు చేర్చటం, ప్రాధాన్యతలు మార్చటం తీవ్రమైన ఉల్లంఘనే అవుతుంది. ఈ ఉల్లంఘనలను సుప్రీం కోర్టుకు నివేదిస్తే మోడీ, దోవల్‌ ద్వయం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లటం ఖాయం. వారిని కాపాడటానికి ఏకంగా న్యాయశాఖ, రక్షణశాఖ, ప్రధాని కార్యాలయం కీలక వాస్తవాలు సుప్రీం కోర్టుకు అందకుండా జాగ్రత్తపడ్డాయన్న విషయం కూడా నిన్నటి వాదనల్లో తేలిపోయింది.
తన గుట్టురట్టు అయిందని గ్రహించి బీజేపీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన కొత్త వాదనే రక్షణశాఖ నుంచి పత్రాలు చోరీ కావటం. ఈ లీకేజికి కారణమైన విలేకరులను దేశం ముందు దోషులుగా చూపించే ప్రయత్నం. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ప్రభుత్వం ఏదో దాయటానికి, ఎవరినో కాపాడటానికి తిప్పలు పడుతోందని స్పష్టమవు తోంది. ఏ న్యాయస్థానమైనా వచ్చిన వార్తలు లేదా ఆరోణల్లో వాస్తవం ఉందా లేదా అని నిర్ధారించటానికి బదులుగా లీకేజిలపై దృష్టి మళ్లిస్తే పరిపాలనలో పారదర్శకతకు కాలం చెల్లినట్లే. ఈ విషయాన్నే ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ''రక్షణ పేరుతో ప్రభుత్వం ఏ కుంభకోణమైనా చేయవచ్చు. కానీ సుప్రీం కోర్టు సదరు కుంభకోణాలను విచారించటానికి సిద్ధమైతే రక్షణ రహస్యాల పేరుతో దాటవేస్తారా'' అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయభద్రత పేరుతో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేఛ్చ లేదని విచారణ బెంచ్‌లో ఉన్న మరో న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌ స్పష్టం చేయటం కొసమెరుపు.
నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీ అయి ఉంటే ఆ విషయాన్ని నవంబరులోనే సుప్రీం కోర్టుకు ఎందుకు నివేదించలేదు అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిజంగా అటువంటి ప్రమాదకర ఘటనే జరిగి ఉంటే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ అడ్డగోలు వాదనల చాటున ప్రభుత్వం తనను తాను రక్షించుకోవటానికి అసలు కుంభకోణంపై దర్యాప్తే అక్కర్లేదన్న వాదన తీసుకోవటం అనైతికం. చట్టవ్యతిరేకం. అవినీతిని, అడ్డదారి ప్రయత్నాలను, ఆశ్రిత పక్షపాతాన్ని అడ్డగోలుగా వెనకేసుకు వచ్చే ప్రయత్నమే. ఇటువంటి ప్రభుత్వం చేతుల్లో దేశరక్షణ భద్రంగా ఉంటుందని ఆశించటం అమాయకత్వమే కాదు. మూర్ఖత్వం కూడా అవుతుంది.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037